Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police arrested BJP MLA Raghunandan Rao
  • గజ్వేల్ లో శివాజీ విగ్రహానికి అవమానం
  • హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు బయల్దేరిన రఘునందన్ రావు
  • హకీంపేట వద్ద రఘునందన్ ను అడ్డుకున్న పోలీసులు
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ కు వెళ్తున్న సమయంలో హకీంపేట వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే గజ్వేల్ లో ఉన్న శివాజీ విగ్రహం వద్ద ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేయడం కలకలం రేపింది. మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని అక్కడున్న స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. 

అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సందీప్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యారు. ఈ ఘటనతో గజ్వేల్ ఒక్కసారిగా భగ్గుమంది. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఆందోళన చేపట్టింది.  

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ కు వెళ్తున్న రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రఘునందన్ కు బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు ఈటల మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Raghunandan Rao
BJP
Arrest

More Telugu News