Ashes Series 2023: యాషెస్ రనౌట్ వివాదం: మాటల యుద్ధంలోకి ప్రధానులూ దిగారు!

british and australian prime ministers have traded verbal bouncers after bairstow out row

  • బెయిర్‌ స్టో ఔట్‌ విషయంలో ఆసీస్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు
  • క్రీడాస్ఫూర్తికి విరుద్ధమన్న యూకే ప్రధాని రిషి సునాక్‌
  • తమ టీమ్స్ విషయంలో గర్విస్తున్నానన్న ఆసీస్ ప్రధాని అల్బనీస్

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో రనౌట్ దుమారం సద్దుమణగడం లేదు. ఇంగ్లాండ్‌ ఆటగాడు బెయిర్‌ స్టోను వివాదాస్పదంగా ఔట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మాజీ ఆటగాళ్లు కూడా ఆసీస్ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చ దేశ ప్రధానుల దాకా వెళ్లింది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు పరస్పరం మాటల దాడికి దిగారు.

బెయిర్‌‌స్టోను ఔట్ చేసిన తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని యూకే ప్రధాని రిషి సునాక్‌ అధికార ప్రతినిధి విమర్శలు చేశారు. ‘‘ఆస్ట్రేలియాలా తాము గెలవాలనుకోవట్లేదని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పాడు. అతడి అభిప్రాయాన్ని ప్రధాని (రిషి సునాక్‌) కూడా అంగీకరించారు. అయితే దీనిపై ఆసీస్‌ ప్రధాని ఆల్బనీస్‌ వద్ద అధికారికంగా నిరసన వ్యక్తం చేయాలని సునాక్‌ భావించడం లేదు” అని ఓ ప్రకటనలో వెల్లడించారు.

బ్రిటన్‌ ప్రధాని విమర్శలకు ఆసీస్‌ పీఎం ఆంథోనీ అల్బనీస్‌ దీటుగా స్పందించారు. ఆస్ట్రేలియా పురుషులు, మహిళల క్రికెట్‌ జట్ల విషయంలో తాను గర్విస్తున్నానని చెప్పారు. ‘‘మా రెండు జట్లు ఇంగ్లాండ్‌పై తమ యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గాయి. అదే పాత ఆసీస్‌.. ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. గెలిచిన వారిని సాదరంగా ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నా’’ అని అల్బనీస్‌ అన్నారు.

రెండో టెస్టు చివరి రోజు గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లింది. ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ క్యారీ బంతిని విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు. బంతి డెడ్‌ కాలేదని భావించిన థర్డ్‌ అంపైర్‌.. బెయిర్‌స్టోను ఔట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

More Telugu News