Sharad Pawar: అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు వున్నాయన్న వార్తలను ఖండించిన శరద్ పవార్

Sharad Pawar rejects speculation that Ajit Pawars rebellion has his blessings

  • ప్రస్తుత పరిణామాలతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని పిలుపు
  • బీజేపీ దేశాన్ని చీల్చాలనుకుంటోందని పవార్ ఆగ్రహం
  • ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపణ

అజిత్ పవార్ తిరుగుబాటుకు తన ఆశీస్సులు ఉన్నాయనే వాదనను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఖండించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మహారాష్ట్రలో తాజా పరిణామాలు సమాజాన్ని విభజించే ప్రయత్నంగా తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుత పరిణామాలతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహనికి గురికావొద్దని పిలుపునిచ్చారు. బీజేపీ దేశాన్ని చీల్చాలనుకుంటోందని ఆరోపించారు. అలాంటి వారిని ఎదుర్కోవడానికి కార్యకర్తల బలం, మద్దతు కావాలన్నారు. రాజకీయ పరిస్థితులను బీజేపీ కలుషితం చేస్తోందన్నారు. సమయం వచ్చినప్పుడు అందరూ తమకే మద్దతిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను సహించరన్నారు. ఎన్సీపీని పునర్నిర్మిస్తామని చెప్పారు. అదే సమయంలో అజిత్ పవార్ తిరుగుబాటు వెనుక తాను ఉన్నాననే ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది నీచమైన ఆరోపణ అనీ, కుత్సిత బుద్ధిగల, తెలివితక్కువ వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారని పవార్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు తాను రాష్ట్రవ్యాప్త పర్యటనను చేపడుతున్నట్లు చెప్పారు. కొంతమంది నాయకులు చేసిన చర్యలకు భయపడేది లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను అన్నింటిని తుడిచిపెట్టాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News