YS Vivekananda Reddy: వివేకా హత్య కేసు: అదనపు సమాచారం ఇవ్వడం కోసం సమయం కావాలని అడిగిన వివేకా కూతురు

Viveka daughter asks for time in supreme court
  • వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా గుర్తించాలని పీఏ కృష్ణారెడ్డి పిటిషన్
  • ఆయన దర్యాఫ్తును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడన్న సునీత  
  • విచారణను బుధవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. హత్యకు సంబంధించి మొదట తామే ఫిర్యాదు చేసినందున బాధితుడిగా గుర్తించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. మరోవైపు, వైఎస్ సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇటీవల సీబీఐ మరో ఛార్జీషీటును దాఖలు చేసిందని, కృష్ణారెడ్డికి సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడానికి సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా, తనను బాధితుడిగా గుర్తించాలంటూ కృష్ణారెడ్డి దాఖలు చేసిన మిస్లేనియస్ దరఖాస్తులో సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. అయితే హత్యపై ముందుగా సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆయన బాధితుడు కాదని, కనీసం కుటుంబ సభ్యుడు కూడా కాదని సునీత అన్నారు. కృష్ణారెడ్డి బాధితుడు కాదని, దర్యాఫ్తును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆమె చెప్పారు. దీంతో ఇదివరకు ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు విచారణ జరగగా.. అదనపు సమాచారం కోర్టు దృష్టికి తీసుకురావడానికి సమయం కావాలన్న సునీతారెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
YS Vivekananda Reddy
sunitha reddy

More Telugu News