Paritala Sriram: పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు
- భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ బస్సుయాత్ర
- బస్సు యాత్ర సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
- తన సోదరి ధనమ్మను విమర్శించారంటూ రాఘవేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ యువనేత, ధర్మవరం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పై ఉమ్మడి అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 26వ తేదీన పరిటాల శ్రీరామ్ బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ పై వడ్డే రాఘవేంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టీడీపీ అధికారంలోకి రాగానే చెప్పుతో కొడతానని టీడీపీ బస్సులో ఉన్న వడ్డే ధనమ్మ తన సోదరి రామకృష్ణమ్మకు చెప్పును చూపించిందని ఫిర్యాదులో రాఘవేంద్ర పేర్కొన్నాడు. ధనమ్మకు మద్దతుగా పరిటాల శ్రీరామ్ తో పాటు మరో నలుగురు తన సోదరిని దూషించారని, బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపాడు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ తో పాటు వడ్డే ధనమ్మ, తూంచెర్ల హరి, కుర్లపల్లి చంద్ర, రాజులపై పోలీసులు కేసు నమోదు చేశారు.