Iron Pillar: బిజీ రోడ్డుపై సడెన్ గా కూలిన ఐరన్ పిల్లర్.. వీడియో ఇదిగో!

Iron Pillar Collapses In Middle Of Busy Karnataka Road

  • కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘటన.. వాహనదారులు షాక్
  • రైల్వే అండర్ బ్రిడ్జి ముందు హెచ్చరికగా ఏర్పాటు చేసిన పిల్లర్
  • పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందన్న అధికారులు

వాహనాల రాకపోకలతో బిజీగా ఉన్న రోడ్డుపై సడెన్ గా ఓ ఐరన్ పిల్లర్ పడిపోయింది. కొద్ది క్షణాల ముందే ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బైక్ లు, వాటి వెనకే ఓ బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండడం గమనించి బైకర్లతో పాటు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అడుగుదూరంలో కళ్లముందే పెద్ద ఐరన్ పిల్లర్ కూలడంతో ఆ బైకర్లు షాక్ కు గురయ్యారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం, ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైల్వే అండర్ బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాలకు ఎత్తుకు సంబంధించిన హెచ్చరిక చేస్తూ ఏర్పాటు చేసిన పిల్లర్ ఇది. ఇటీవల పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల సందర్భంగా ఏర్పడే వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారి సడెన్ గా కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News