Rahul Gandhi: ఆ ఇద్దరిపై వేటు వేస్తే...: తెలంగాణ నేతలకు క్లాస్ పీకిన రాహుల్ గాంధీ

Rahul Gandhi warning to Telangana leaders

  • పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని హెచ్చరిక
  • తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్య
  • అధికారం కావాలా? మీడియాలో కనబడటం కావాలా? అని ప్రశ్న

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గట్టి హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. మీడియా కథనాల మేరకు... పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కవద్దని సూచించారు. ఎవరికైనా, ఏవైనా సమస్యలు ఉంటే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేకు చెప్పాలని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకుంటే తనకు కూడా చెప్పవచ్చునని సూచించారు. 

ఇక నుండి ఎవరైనా మీడియాకు ఎక్కితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కర్ణాటకలోను ఇలాంటి పరిస్థితి ఎదురైందని, తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వారు దొరికితే మాత్రం ఆ ఇద్దరిపై వేటు వేస్తే అంతా సెట్ అవుతుందని చెప్పారట. అధికారం కావాలా.. మీడియాలో కనబడటం కావాలా? అని అందరికీ కలిపి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో ఇద్దరు దొరికేలా ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆ ఇద్దరు ఎవరనే చర్చ సాగుతోంది.

స్ట్రాటెజీ కమిటీ భేటీ సందర్భంగా రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి సహా పలువురు నేతలు వివిధ అంశాలపై మాట్లాడగా.. సాధ్యమయ్యే హామీల గురించి మాట్లాడుదామని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఫిర్యాదు చేయబోయిన నేతలను కూడా రాహుల్ వారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అందరి గురించి తెలుసునని చెప్పారని తెలుస్తోంది. కానీ ఈసారి గీత దాటితే మాత్రం అలాంటివారిపై చర్యలు ఖాయమని చెప్పారట.

ఎవరూ డిక్లేర్ చేయవద్దు...

ఈ కమిటీలో పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు అగ్రనేతలు. కర్ణాటక తరహా త్వరగా టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. క్లియర్ గా ఉన్న స్థానాలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఏ నేత కూడా టిక్కెట్ డిక్లేర్ చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ టిక్కెట్లు ఖరారు చేస్తుందని చెప్పారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి సలహాలు, సూచనలు మాత్రం ఇవ్వాలని చెప్పారు. మండల, బూత్ స్థాయి కమిటీలు వేయాలని సూచించారు. ధరణిని ఉపయోగించుకోవాలన్నారు. ఓబీసీలకు టిక్కెట్ల విషయంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై క్లారిటీ ఇస్తామని చెప్పారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News