Etela Rajender: కేసీఆర్‌కు ఓటు వేయొద్దు.. బీజేపీయే గెలుస్తుంది: ఈటల పిలుపు

Etela Rajender says BJP will win next election

  • ఇంటింటికి, వాడవాడకు బీజేపీని తీసుకు వెళ్తామన్న ఈటల
  • కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు చేయవద్దని హితవు
  • కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని సామాన్యులకు అర్థమైందన్న ఈటల
  • ముదిరాజ్ లకు ఆస్తులు, అంతస్తులు లేకున్నా ఆత్మగౌరవముందని వ్యాఖ్య

తెలంగాణలో ఈ పార్టీ గెలుస్తుంది.. ఆ పార్టీ గెలుస్తుందని అంటున్నారని.. కానీ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఎక్కువగా గెలుస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ఇంటింటికి, వాడవాడకు బీజేపీని తీసుకు వెళ్తామన్నారు. బీజేపీపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రజల ఆశీర్వాదంతో కమలం పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈసారి కేసీఆర్ కు ఓటువేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇప్పటికైనా భూమి మీదకు రావాలని, మీడియాను, పేపర్ ను దగ్గర పెట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేయవద్దని సూచించారు.

కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని సామాన్య ప్రజలకు కూడా అర్థమైందన్నారు. అందుకే ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలని నిర్ణయానికి వచ్చారన్నారు. తనకు పోలీసుల రక్షణ కంటే ప్రజల రక్షణే ఉందన్నారు.

ధరణి వచ్చాక పేదల భూములు మాయమవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కు ధరణి డబ్బుల పంటను పండించిందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ధరణి వచ్చాక బ్రోకర్లు బాగా పెరిగిపోయారని, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలపై దౌర్జన్యం పెరుగుతోందన్నారు.

ముదిరాజ్ లను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసినట్లుగా వచ్చిన వీడియోపై కూడా ఈటల స్పందించారు. అన్ని కులాలను వారు అలాగే మాట్లాడుతారని, ముదిరాజ్ ల వీడియో మాత్రం బయటపడిందని చెప్పారు. ముదిరాజ్ లకు ఆస్తులు, అంతస్తులు ఉండకపోవచ్చు.. కానీ ఆత్మగౌరవం ఉందన్నారు. వారితో పెట్టుకుంటే మాడిమసి అవుతారని శాపనార్థాలు పెట్టారు. ముదిరాజ్ లపై చేసిన వ్యాఖ్యలకు గాను కేసీఆర్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు. ఎందుకంటే వారి ఆత్మగౌరవం మీద కొట్టే ప్రయత్నం జరిగిందన్నారు. ఏ వర్గాల ఓట్లతో గెలిచారో వారినే అవమానించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News