Pawan Kalyan: నరసాపురం ప్రభాస్ అభిమానులకు నా అభినందనలు: పవన్ కల్యాణ్
- నరసాపురంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- పట్టణంలో జనసేనకు మద్దతు పలుకుతూ ప్రభాస్ అభిమానుల బ్యానర్
- ప్రభాస్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తాడని... ట్యాక్సులు కడతాడని వెల్లడి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సభకు హాజరయ్యారు. నరసాపురం పట్టణంలో జనసేనకు మద్దతుగా హీరో ప్రభాస్ అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు.
జనసేనకు మద్దతు తెలిపిన నరసాపురం ప్రభాస్ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రభాస్ గారు బాహుబలి చేసినా, ఆదిపురుష్ చేసినా రోజుకు 500 మంది నుంచి 1000 మందికి ఉపాధి కల్పిస్తారని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తారని పవన్ వివరించారు. ప్రభాస్ ట్యాక్సులు కడతాడని వెల్లడించారు. కానీ ఈ జగన్ నీతిగా సంపాదించడని, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు చాలా బాధ కలిగిందని తెలిపారు. అవినీతి చేసిన వ్యక్తులను అందలం ఎక్కించారని, కానీ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితో వచ్చిన తనను మాత్రం ఓడించారని వివరించారు. అయితే ఇవాళ ఇంతమంది తనకు అండగా నిలవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.
పులివెందుల విద్యా సంస్కృతిని గోదావరి జిల్లాలకు రానివ్వబోమని స్పష్టం చేశారు. "జగన్ మోహన్ రెడ్డికి చెబుతున్నా... మీరు పులివెందుల రౌడీ రాజకీయం గోదావరి జిల్లాలకు తీసుకువచ్చారు. నరసాపురం నుంచి చెబుతున్నా... ఇది గూండాలకు, రౌడీలకు భయపడే నేల కాదు... ఎవర్నయినా ఎన్నిసార్లు భయపెట్టగలరు? కోనసీమలో డీఎస్పీని ఓ మంత్రి కొడుకు కొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే విప్లవాలు పుట్టుకొస్తాయి. వైసీపీ గెలిస్తే రాజ్యాంగం గెలిచినట్టు... లేకపోతే లేదు అననట్టుగా మాట్లాడతాడు. ఇక్కడ పసలదీవి పంచాయతీలో జనసేనకు 1,400 ఓట్లు రాగా, వైసీపీకి 380 ఓట్లు వచ్చాయి. దాంతో పంచాయతీకి నిధులు ఇవ్వడం మానేశాడు. ఇదేనా రాజ్యాంగం?" అంటూ పవన్ విమర్శలు కురిపించారు.