MBBS Student: కర్నూలు మెడికల్ కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య

MBBS Student suicide at Kurnool ViswaBharathi Medical College

  • హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న యువకుడు
  • ప్రేమ విఫలం కావడం వల్లేనని పోలీసుల అనుమానం
  • ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు

కర్నూలు జిల్లా కేంద్రంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో సోమవారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. సోమవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయాందోళనలకు గురైన తోటి విద్యార్థులు తొలుత మేనేజ్ మెంట్ కు, ఆపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న లోకేశ్ సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో తన గదిలో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున మిగతా విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. లోకేశ్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి అని పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలం కావడం వల్లే లోకేశ్ ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. లోకేశ్ తండ్రి బ్రహ్మానందరావుకు సమాచారం అందించినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

More Telugu News