Nara Lokesh: ​బ్రాహ్మణులపై హామీల జల్లు కురిపించిన నారా లోకేశ్

Lokesh held meeting with Brahmins in Jayampu village

  • వెంకటగిరి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
  • జయంపు గ్రామంలో రచ్చబండ
  • బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించిన లోకేశ్
  • తమ సమస్యలు వివరించిన బ్రాహ్మణులు
  • ప్రభుత్వ ఖజానా నుంచే అర్చకులకు వేతనం చెల్లిస్తామన్న లోకేశ్
  • వేద విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారం రోజులపాటు వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగించిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భారీ గజమాలలు, బాణాసంచా మోతలతో కేరింతలు కొడుతూ సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. 

కాగా, ఇవాళ లోకేశ్ పాదయాత్రకు ఆయన మేనమామ నందమూరి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. లోకేశ్ తో కలిసి కొంతదూరం ఆయన అడుగులు వేశారు. తన మామ రామకృష్ణ రాకతో సంతోషం వ్యక్తం చేసిన లోకేశ్... కుటుంబసభ్యుల క్షేమ సమాచారం తెలుసుకున్నారు. 

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బ్రాహ్మణులు సహకరించాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవాలయాల భూములకు కూడా రక్షణ కరువైందని లోకేశ్ విమర్శించారు. వెంకటగిరి నియోజకవర్గం జయంపు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ బ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు తమ సమస్యలను లోకేశ్ కు విన్నవించారు. 

"అపర కర్మలు నిర్వహించడానికి భవనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. నియోజకవర్గానికి ఒక భవనం కడితే ఉపయోగంగా ఉంటుంది. జగన్ పాలనలో పురోహితులకు గౌరవ వేతనం అందడం లేదు. కొంత మందికి మాత్రమే నామ మాత్రంగా అందుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేషన్ నుండి బ్రాహ్మణ విద్యార్థుల చదువు కోసం సహాయం అందడం లేదు. 

వేద పాఠశాలల్లో అభ్యసించిన వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. ఉద్యోగాలు కూడా రావడం లేదు. సర్టిఫికెట్లు ఉన్నా ఉపయోగం లేక వేద విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో పేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య, బ్రాహ్మణ ఆడ పిల్లల పెళ్లిళ్లకు సహాయం అందడం లేదు. బ్రాహ్మణులపై దాడులు పెరిగాయి. మమ్మల్ని కాపాడటానికి ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చెయ్యాలి. 

దేవుడు మాన్యం పట్టాలు లేక అన్యాక్రాంతం అవుతుంది. గుడి పేరు మీద పట్టా ఇస్తే నిర్వహణ ఖర్చులకి ఉపయోగంగా ఉంటుంది. అర్చకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. తిరుమలలో దర్శన అవకాశం కల్పించాలి. 

దాతలు గుడులు కడుతున్నారు... కానీ అర్చకులకు కనీస వేతనం లేక ఇబ్బంది పడుతున్నాం. ధూప, దీప, నైవేద్యం కోసం కూడా ఇబ్బంది పడుతున్న అనేక ఆలయాలు ఉన్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రాహ్మణుల సమస్యలపై లోకేశ్ ఏమన్నారంటే...!

 బ్రాహ్మణుల వినతుల పట్ల లోకేశ్ స్పందించారు. వైసీపీ నేతలు ఆలయాల భూములను కూడా యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక దేవాదాయశాఖతో సంబంధం లేకుండా అర్చకులకు గౌరవ వేతనం, ఆలయాల నిర్వహణకు అయ్యే ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచే అందజేస్తామని వెల్లడించారు. బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం తెలుగుదేశమేనని స్పష్టం చేశారు. 

"వైసీపీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. బ్రాహ్మణులకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాల్సి ఉంది. పేద బ్రాహ్మణ విద్యార్థుల చదువుకు ప్రభుత్వం సహాయం చేయడం లేదు. మేం వచ్చాక అర్చకులకు ఐడీ కార్డులు అందజేసి, తిరుమలలో దర్శనానికి చర్యలు తీసుకుంటాం" అని భరోసా ఇచ్చారు.

వేద విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం!

గతంలో విదేశీ విద్య, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ కు నిధులిచ్చి బ్రాహ్మణులను పేదరికం నుంచి బయటకు తెస్తాం. అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అపరకర్మల భవనాలు నిర్మిస్తాం. 

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రతినెలా యువగళం పేరుతో రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వేద పాఠశాలల విద్యాభ్యాసం చేసినవారికి కూడా నిరుద్యోగ భృతి వర్తింపజేస్తాం. 

నియోజకవర్గ స్థాయిలో బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆడబిడ్డ నిధి కింద నెలనెలా 1500 ఇస్తాం, పేద ఆడబిడ్డలకు పెళ్లికానుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. గుడి స్థాయిని బట్టి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిర్వహణకు నిధులిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1753.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.3 కి.మీ.*

*136వ రోజు పాదయాత్ర వివరాలు (24-6-2023):*

*సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

మధ్యాహ్నం

2.00 – వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ లో చర్చిఫాదర్లతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.15 – పెద్దపరియ క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

5.00 – తిరుమలపూడి ఎస్టీ కాలనీలో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.

5.10 – తిరుమలపూడి దళితవాడలో స్థానికులతో మాటామంతీ.

6.00 – మాచవరంలో రైతులతో సమావేశం.

6.20 – ముమ్మాయపాలెంలో స్థానికులతో సమావేశం.

8.00 – కోనేటిరాజుపాలెంలో స్థానికులతో సమావేశం.

8.30 – మనవలి రోడ్డులో స్థానికులతో మాటామంతీ.

8.50 – మేనకూరులో స్థానికులతో మాటామంతీ.

9.10 – మేనకూరు శివారు విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News