YS Jagan: జగన్, కేసీఆర్ సహా... పాట్నా భేటీకి 60 ఎంపీ సీట్లు ఉన్న ఈ పార్టీలు దూరం

Grand Patna meeting Why opposition parties have an uphill task at hand

  • బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పాట్నాలో పార్టీల సమావేశం
  • ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రాకపోవడం ఇబ్బందికరమే
  • 60 సీట్లు గెలిచిన పార్టీలు దూరం

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పాట్నాలో విపక్ష పార్టీల కూటమి సమావేశమైంది. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పదిహేను పార్టీలు పాల్గొన్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకతాటిపైకి రాకపోవడం విపక్ష పార్టీల కూటమికి అతిపెద్ద సవాల్.

ప్రతిపక్ష పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (తృణమూల్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (ఆమ్ ఆద్మీ పార్టీ), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే), ఝార్ఖండ్ కు చెందిన హేమంత్ సోరెన్ (జేఎంఎం), సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే (శివసేన-యూబీటీ), ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు.

జాతీయస్థాయిలో కీలకమైన విపక్ష నేతలు ఏకతాటిపైకి రావడం విపక్ష పార్టీల కూటమికి సానుకూల అంశమే. కానీ కీలకమైన మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఆహ్వానం రాకపోవడం లేదా సమావేశానికి రాకపోవడం.. ఏదో ఒకటి జరిగింది. కీలకమైన పార్టీలు దూరంగా ఉండటం బీజేపీని ఎదుర్కోవాలనుకుంటున్న విపక్ష పార్టీల కూటమికి సవాలే.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రాంతీయ పార్టీలు 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల సంఖ్య 88. కాంగ్రెస్ ను మినహాయిస్తే డీఎంకే, తృణమూల్, జేడీయూ, శివసేన ఉద్ధవ్ థాకరే, ఎస్పీ, ఎన్సీపీ పెద్ద పార్టీలు. కానీ ఈ సమావేశానికి గైర్హాజరైన ప్రాంతీయ పార్టీలు గెలిచిన సీట్లు 60. ఇందులో వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్, బీఎస్పీ, టీడీపీ, అకాలీదళ్, మజ్లిస్ ఉన్నాయి. 60 సీట్లు కలిగిన ప్రాంతీయ పార్టీలు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం ప్రతిపక్ష పార్టీల కూటమికి జీర్ణించుకోలేని అంశంగా చెబుతున్నారు. 

అలాగే, ఈ భేటీలో పాల్గొన్న నేతల్లో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, భగవంత్ మాన్, సోరెన్, స్టాలిన్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరు ఈ కూటమిలో చాలా కీలకం. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీలు గెలిచిన సీట్లు 63.

ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కాకపోతే బీజేపీ వ్యతిరేక ఫోర్స్ బలం తగ్గినట్లేనని అంటున్నారు. ఢిల్లీ, పంజాబ్ లలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 లోక్ సభ సీట్లలో గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇలాంటి చోట్ల విపక్ష పార్టీల మధ్య సీట్ల లొల్లి తలెత్తితే ఇబ్బందికరమే.

  • Loading...

More Telugu News