Man arrested: ఒక్క బెదిరింపుతో నాలుగు గంటలు నిలిచిపోయిన విమానం
- హైజాక్ హైజాక్ అంటూ అరిచిన ప్రయాణికుడు
- దీంతో టేకాఫ్ తీసుకోని విస్తారా ఎయిర్ లైన్స్ విమానం
- తనిఖీలతో నాలుగు గంటలు ఆలస్యం
- ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
ఓ వ్యక్తి ఒక్కసారిగా అరుస్తూ చేసిన బెదిరింపుతో ఓ విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయల్దేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విస్తారా ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ కు సిద్ధమైంది. ఇక టేకాఫ్ తీసుకుంటుందనగా.. ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా ‘హైజాక్ హైజాక్’ అంటూ పెద్దగా అరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు అందరూ హడలిపోయారు. విమానాశ్రయం భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.
హైజాక్ అని అరిచిన రితేష్ సంజయ్ కుమార్ జునేజాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విమానంలోని ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. విమానం మొత్తాన్ని తనిఖీ చేశారు. దీంతో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరాల్సిన విమానం రాత్రి 10.30 గంటలకు టేకాఫ్ అయింది. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీన్ని విస్తారా ఎయిర్ లైన్స్ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. విస్తారా ఫ్లయిట్ యూకే996లో ఓ ప్రయాణికుడు వికృతంగా వ్యవహరించినట్టు తెలిపారు.
ఇంతకీ అలా చేసిన వ్యక్తికి మానసిక అనారోగ్యం ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. మానసికంగా నిలకడ లేకపోవడంతో ఫ్లయిట్ లో అలా అరిచి ఉంటాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. హైజాక్ అని అతడు చేసిన బెదిరింపునకు ప్రతి ప్రయాణికుడిని, వారి లగేజీని భద్రతా సిబ్బంది మరోసారి తనిఖీ చేయాల్సి వచ్చింది.