Congress: బీజేపీ అంతం.. ప్రతిపక్షాల పంతం.. రాహుల్‌కు సాదర స్వాగతం పలికిన నితీశ్‌కుమార్

Nitish Kumar welcomes Rahul Gandhi at airport

  • సమావేశానికి సిద్ధమైన ప్రతిపక్షాలు
  • ఇప్పటికే పాట్నా చేరుకున్న ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు
  • మెలిక పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ

అధికార బీజేపీని అంతు చూసేందుకు ఒక్కటవుతున్న ప్రతిపక్షాల నేతలు మరికాసేపట్లో సమాశం కాబోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), డీఎంకే, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సమావేశానికి హాజరవుతున్నాయి.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఓ మెలిక పెట్టింది. ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా నిలవకపోతే ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆప్ హెచ్చరించింది. కాగా, ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.

ఆరుగురు సీఎంలు.. ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు
ప్రతిపక్షాల సమావేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులు, ఐదుగురు మాజీ సీఎంలు హాజరవుతున్నారు. వీరిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఎంకే స్టాలిన్‌ నిన్న సాయంత్రమే పాట్నా చేరుకున్నారు. అలాగే, సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతోపాటు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ థాకరే హాజరుకానున్నారు.

Congress
Rahul Gandhi
Opposition Meet
Nitish Kumar

More Telugu News