MS Dhoni: ధోనీకి శస్త్రచికిత్స... అప్పటి దాకా ఆడడు: సీఎస్కే సీఈవో నుండి బిగ్ అప్‌డేట్

CSK CEOs Big Update On MS Dhoni Knee Injury

  • కోకిలాబెన్ ఆసుపత్రిలో ధోనీకి శస్త్రచికిత్స
  • ధోనీని ఈ మధ్య పరామర్శించానని వెల్లడించిన సీఈవో
  • వచ్చే జనవరి - ఫిబ్రవరి వరకు ఆడడని వెల్లడి

సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడని, దీనిపై ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని, పైగా ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయలేదని, జట్టును ముందుండి నడిపించాడని, ఐదో టైటిల్ అందుకున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ తెలిపారు. ధోనీ ఈ నెల ప్రారంభంలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

ఐపీఎల్ మొత్తంలో ధోనీకి ఇష్టం లేకుంటే ఆడమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. మోకాలి గాయం ఉన్నప్పటికీ ఒకవేళ అన్‌ ఫిట్‌ అయితే ఆ విషయాన్ని ధోనీ ముందుగానే స్పష్టం చేసి ఉండేవారని తమకు తెలుసునని చెప్పారు.

మీరు మ్యాచ్ ఆడాలనుకుంటున్నారా లేక బయట కూర్చోవాలనుకుంటున్నారా? అనే ప్రశ్న అతని ముందు తాము ఎప్పుడూ లేవనెత్తలేదన్నారు. ఆడే సామర్థ్యం లేకుంటే ధోనీయే తమకు ముందుగా చెబుతాడన్నారు.

ధోనీ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడని అర్థమైందని, కానీ జట్టు పట్ల అతని నిబద్ధత, అతని నాయకత్వం కారణంగా జట్టు ఎలా ప్రయోజనం పొందుతుందో అందరికీ తెలుసునని చెప్పారు. ఆ కోణం నుండి, మీరు అతన్ని అభినందించాలన్నారు.

ఫైనల్ వరకు, అతను తన మోకాలి గురించి ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, అతను నడుస్తున్న సమయంలో కాస్త ఇబ్బంది పడటం మీరు చూసి ఉంటారన్నారు. కానీ అతను ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మాత్రం ఆపరేషన్ కు సిద్ధపడ్డాడని చెప్పారు. ఆపరేషన్ పూర్తయిందని, కోలుకుంటున్నాడని విశ్వనాథన్ చెప్పారు.

ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారంపై స్పందిస్తూ... శరీరం సహకరిస్తే వచ్చే సీజన్ కు అందుబాటులో ఉంటానని ధోనీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం చెప్పాడని వెల్లడించారు. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విషయంలో ముందుకు వెళ్లాలో ధోనీకి తెలుసునని, కాబట్టి దీని గురించి అతనిని తాము అడగడం లేదన్నారు. ఏదైనా ఉంటే అతనే స్వయంగా చెబుతాడన్నారు.

వాస్తవానికి ఫైనల్ ముగిసిన తర్వాత ముంబై కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకొని రిహాబిలిటేషన్ కోసం రాంచీకి వెళ్తానని తమతో చెప్పాడన్నారు. 

జూన్ 4న రుతురాజ్ గైక్వాడ్ వివాహ వేడుకకు హాజరై, ఆ తర్వాత ముంబైలో ధోనీని పరామర్శించినట్లు చెప్పారు కాశీవిశ్వనాథన్. అతడు సౌకర్యంగా ఉన్నాడని, మూడు వారాల విశ్రాంతి తర్వాత రిహాబిలిటేషన్ కోసం రాంచీ వెళ్తానని చెప్పాడన్నారు. అతను చెప్పిన విధంగా వచ్చే జనవరి - ఫిబ్రవరి వరకు ఆడడని, వీటి గురించి ధోనీకి గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News