jupalli krishna rao: కేసీఆర్ ఆ అర్హతను కోల్పోయారు: జూపల్లి కృష్ణారావు
- తెలంగాణను వ్యతిరేకించే వారితో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని ఆగ్రహం
- అమరుల ఆకాంక్ష నెరవేరడం లేదని ఆవేదన
- ప్రజలను మభ్యపెట్టే పథకాలు తీసుకు వస్తున్నారన్న జూపల్లి
తెలంగాణను వ్యతిరేకించే వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. వారి ఆహ్వానంపై తాను నేతలతో చర్చిస్తానన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్ కోల్పోయారని దుయ్యబట్టారు. అమరుల ఆకాంక్షలు అసలు నెరవేరలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలను సీఎం తీసుకు వస్తున్నారని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఏమైందో చెప్పాలని నిలదీశారు. పైసల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.