Australia: సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో ఆసీస్ విన్... యాషెస్ లో కంగారూల బోణీ

Australia beat England by 2 wickets in Ashes opener
  • ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్
  • తొలి టెస్టులో ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం
  • 281 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి ఛేదించిన కంగారూలు
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్, లైయన్
టెస్టు మ్యాచ్ ఇంత రసవత్తరంగా ఉంటుందా అనేలా సాగిన యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లైయన్ జోడీ ఇంగ్లండ్ బౌలర్లకు కొరకరానికొయ్యలా పరిణమించింది. కమిన్స్ 44, లైయన్ 16 పరుగులతో అజేయంగా నిలిచారు. 

ఆసీస్ టార్గెట్ 281 పరుగులు కాగా... చివరి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 107/3 తో ఐదో రోజు ఆట కొనసాగించిన ఆసీస్... ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనిస్తున్నట్టు కనిపించారు. కానీ చివర్లో కమిన్స్, లైయన్ జోడీ మొండిగా పోరాడడంతో విజయం కంగారూలనే వరించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజ వేసింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 393/8 వద్ద స్కోరు డిక్లేర్ చేసింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులు చేయగా... ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అయితే ఆసీస్ జట్టులో ఆటగాళ్లందరూ శక్తిమేర పోరాడడంతో ఇంగ్లండ్ కు పరాజయం తప్పలేదు. 

ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 28 నుంచి జులై 2 వరకు జరగనుంది.
Australia
England
1st Test
Ashes

More Telugu News