Andhra Pradesh: ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి: ఆరుద్ర

Arundra lashes out at minister

  • కూతురుకు వైద్య సాయం కోసం ఆరుద్ర అనే మహిళ నిరాహార దీక్ష
  •  మద్దతు పలికిన దివ్యాంగుల హక్కుల పోరాట సమితి
  • పోలీసుల తీరు వల్లే తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన 

ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమెకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఆరుద్ర మాట్లాడుతూ... తన కుమార్తె సాయిచంద్రకు వైద్యసాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల తీరు వల్లే తన బిడ్డకు ఈ దుస్థితి పట్టిందని, రాష్ట్రంలో జగన్ మాట కంటే మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్ మాటనే చెల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ, మంత్రి.. గన్ మెన్ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఆరుద్రది కాకినాడ రూరల్ పరిధిలోని రాయుడుపాలెం. కదల్లేని స్థితిలో ఉన్న తన కూతురు సాయిచంద్రకు సాయంచేయాలని కొంతకాలంగా కోరుతున్నారు. కనీసం తన ఇల్లు అమ్మి వైద్యం చేయించుకుందామంటే మంత్రి అండతో కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 2న సీఎం క్యాంపు ఆఫీస్ కు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె ఎడమచేతి మణికట్టు కోసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

ఆ తర్వాత ఆరుద్ర తన కూతురుతో కలిసి ఇటీవల కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అధికారుల నుండి కూడా స్పందన రావడం లేదని ఈ నెల 7న కలెక్టరేట్ వద్ద కూతురుతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత పోలీసులు దీక్షను భగ్నం చేసి, జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్సకు నిరాకరించారు. ఆ తర్వాత వారిని పోలీసులు విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. ఇప్పుడు ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు.

  • Loading...

More Telugu News