Anasuya Bharadwaj: ఇతరులను అగౌరవపర్చడానికి నా పేరు వాడుకోవద్దు: అనసూయ
- మరోసారి సోషల్ మీడియాలో అనసూయ ఆసక్తికర పోస్టు
- నెటిజన్లకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ ట్వీట్
- రాజకీయ, వినోద రంగంలో ఉన్నవారిని తనతో పోల్చుతున్నారని వెల్లడి
- తద్వారా వారిని కించపర్చుతున్నారని ఆవేదన
టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ నిత్యం ఏదో అంశంతో వార్తల్లో ఉంటారు. కొన్నిరోజుల కిందటే ఓ యువ హీరో అభిమానులతో పోరాటం సాగించిన అనసూయ... తాజాగా నెటిజన్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేందుకు తన పేరును ఉపయోగించుకోవడం సరికాదని హితవు పలికారు.
"హలో ఎవ్రీ వన్... అందరికీ నాదొక విజ్ఞప్తి. గత కొన్నిరోజులుగా అనేక ట్వీట్లు నా దృష్టికి వచ్చాయి. రాజకీయ, వినోద రంగంలో ఉన్నవారిని నాతో పోల్చుతూ అగౌరవపరుస్తున్న విషయం తెలిసింది. ఇలాంటి విషయాల కోసం నా పేరును ఉపయోగించుకోవడం అంటే నన్ను కూడా అవమానించినట్టే. ఇలాంటి సమస్యాత్మక అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చిన రీతిలో గడపాలని కోరుకుంటాను. ఇతరుల ఆసక్తులకు అనుగుణంగా నేను జీవించాలనుకోవడంలేదు. నేను కష్టపడి సాధించుకున్న జీవితం ఇది... ఇలాంటి విషయాలు అనవసరమైన బాధ కలిగిస్తాయి.
నేను స్వయంకృషితో ఎదిగిన మహిళను. నాకు నేనుగా చెబుతున్న ఈ మాటను నమ్మండి. ఎందుకంటే నాకు పీఆర్ఓ ఎవరూ లేరు. అంతేకాకుండా, నా లోపాలను కప్పిపుచ్చేందుకు, నన్ను మరీ ఆకాశానికి ఎత్తేసేందుకు అవసరమైన వ్యవస్థలు కూడా నాకు లేవు.
మీరు నన్ను ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు... నా జోలికి మాత్రం రావొద్దు. మీరు తలకుమించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ అందులోకి నా పేరును లాగొద్దు. నాకు తోచిన సరైన మార్గంలో నేనేంటో నిరూపించుకునేందుకు ముందుకు వెళుతున్నాను. నాకూ ఓ కుటుంబం ఉంది... దయచేసి నా జోలికి రావొద్దు" అంటూ అనసూయ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.