TSRTC: ఇక సిటీ ఆర్డినరీ బస్సు ఎక్కడుందో చూడొచ్చు .. ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చిన టీఎస్ ఆర్టీసీ

TSRTC plans to introduce vehicle tracking system in ordinary buses

  • ఆర్డినరీ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్న టీఎస్ ఆర్టీసీ
  • ఇప్పటికే 900 మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రవేశపెట్టిన సంస్థ
  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు   

దాదాపు 900 మెట్రో ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో అధునాతన వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (విటిఎస్)ని విజయవంతంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ‘ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా  ప్రయాణికులు తాము ఎక్కాలనుకున్న బస్సు ఎక్కడుందనే సమాచారం తెలుసుకోవచ్చు. ఆయా బస్టాప్ కు బస్సు ఏ సమయంలో వస్తుందో తెలుస్తుంది. 

ట్రాకింగ్ సిస్టమ్ టీఎస్ ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్న తెలంగాణ, సమీప రాష్ట్రాల్లోని వివిధ స్టాపుల్లో బస్సుల రాక, నిష్క్రమణ గురించి ప్రయాణికులకు తెలియజేస్తుంది. ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించి ప్యాసింజర్స్ తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బస్ స్టాప్స్, స్టేషన్లలో అనవసర నిరీక్షణ సమయాన్ని నివారించవచ్చు’ అని టిఎస్‌ ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే ఏసీ పుష్పక్ సహా 4 వేల బస్సుల్లో ట్రాకింగ్ అమలు చేయనున్నారు. 

వంద సుదూర ప్రాంతాలతో పాటు శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నం ప్రయాణించే బస్సుల్లో టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. తదుపరి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక రకం సేవలకు వెహికల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. 

‘కొన్నిసార్లు సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ, ఈ యాప్ బస్సు ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతోంది. వీలైనప్పుడల్లా ట్రాకింగ్ సిస్టమ్ గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని బస్ కండక్టర్లను ఆదేశించాము’ అని ఆర్టీసీ అధికారి తెలిపారు. ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు  సూచించారు. ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.inలో కూడా యాప్ అందుబాటులో ఉంది.

More Telugu News