New Delhi: తాగిన మత్తులో కారు, ల్యాప్‌ట్యాప్, రూ. 18 వేలు అపరిచిత వ్యక్తికి ఇచ్చేసి మెట్రోలో ఇంటికి!
- ఢిల్లీలో మద్యం మత్తులో ఘటన
- అపరచిత వ్యక్తికి మద్యం తాగేందుకు కంపెనీ ఇచ్చిన బాధితుడు
- ఆ తర్వాత మార్గమధ్యంలో దిగిపోయిన కారు యజమాని
- మెట్రోలో ఇంటికి చేరుకున్న వైనం
- మత్తు దిగాక గుర్తొచ్చి పోలీస్ స్టేషన్‌కు పరుగులు
తాగిన మత్తులో అపరిచిత వ్యక్తికి తన కారు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, రూ. 18 వేల నగదు అప్పగించేసి మెట్రో ఎక్కి ఇంటికి చేరుకున్నాడో ఉద్యోగి. ఇంటికెళ్లి మత్తు దిగాక తన కారు కనిపించకపోవడంతో విషయం అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్-II ప్రాంతానికి చెందిన అమిత్ ప్రకాశ్ (30) గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ మద్యం తాగాడు.
మళ్లీ తాగాలనిపించి ఓ షాపులో మద్యం కొనుగోలు చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అమిత్ రూ. 2 వేల ఖరీదైన మద్యం కోసం రూ. 20 వేలు ఇచ్చాడు. అయితే, షాపు యజమాని మాత్రం రూ. 18 వేలు తిరిగి ఇచ్చేసినట్టు అమిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మద్యం తీసుకున్న అమిత్ ఆ తర్వాత కారులో కూర్చుని తాగడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తాను కూడా కలవొచ్చా? అని అడిగాడు. సరేనన్న అమిత్ అతడితో కలిసి కారులోనే మందుకొట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ సుభాష్ చౌక్ చేరుకున్నారు. అది తన సొంత కారన్న విషయం మర్చిపోయిన అమిత్ అక్కడ దిగిపోయి ఆటో ఎక్కి మెట్రో స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నాడు. మత్తు దిగాక తన కారు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడికి సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కారులో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, రూ. 18 వేల నగదు కూడా ఉండిపోయాయి.