Telangana: ఆంధ్ర ఇక్కడికి 25 కిలో మీటర్ల దూరమే.. మరి ఏపీకి, తెలంగాణకు తేడా చూడండి: గద్వాల సభలో కేసీఆర్

KCR on difference between Telangana and AP

  • తెలంగాణ వస్తే చీకటిమయమవుతుందని మాట్లాడారన్న కేసీఆర్
  • ప్రజల గురించి ఆలోచించని వారు ధరణిని తీసేస్తామంటున్నారని ఆగ్రహం
  • మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువస్తే కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శ 

తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని విభజనకు ముందు మాట్లాడారని, కానీ ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు ఎంత తేడా ఉందో గమనించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. గతంలో పాలమూరు నుండి వలస వెళ్లేవారని, ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి పాలమూరుకు వస్తున్న వారిని చూస్తున్నామని చెప్పారు. మీకు కరెంట్ రాదు.. తెలంగాణ చీకటిమయం అవుతుందని నాటి పాలకులు అన్నారని గుర్తు చేశారు. ఇక్కడకు ఆంధ్రా కేవలం 25 కిలో మీటర్ల దూరమేనని, ఇక్కడికీ, ఏపీకి ఎంత తేడా ఉందో గమనించాలన్నారు.

ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించని వారు ఇప్పుడు ధరణిని తీసివేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కానీ ధరణి కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడుతోందని, పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయన్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపించాలన్నారు.

  • Loading...

More Telugu News