Mekapati Chandrasekhar Reddy: జగన్ దగ్గరికి ఐదు సార్లు వెళ్లాను.. టికెట్ ఇవ్వనని మొఖాన ఉమ్మేసినట్టు చెప్పారు: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

mekapati chandrashekhar reddy meets nara lokesh
  • త్వరలోనే టీడీపీలో చేరుతానన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
  • నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ తెలుగుదేశంలో చేరతారని వెల్లడి
  • టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, ఇవ్వకున్నా పార్టీ కోసం పని చేస్తానని వ్యాఖ్య
త్వరలోనే టీడీపీలో చేరుతానని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. తనతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం అట్లూరు విడిది కేంద్రంలో లోకేశ్‌ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. లోకేశ్ పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి ప్రవేశిస్తుండగా.. స్వాగతం పలికి యాత్రను దిగ్విజయం చేస్తానని తెలిపారు.

లోకేశ్ తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నారా లోకేశ్‌ను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించా. పాదయాత్ర ఉదయగిరిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చాను. నా నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేస్తా’’ అని చెప్పారు.

జగన్‌మోహన్ రెడ్డిని టికెట్ కోసం ఐదు సార్లు కలిసినా లాభం లేదని, ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ‘‘మొఖాన ఉమ్మేసినట్టు.. ‘నీకు టికెట్ ఇవ్వటం లేదు. వేరే వ్యక్తిని చూస్తున్నాం. నీకు కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తాం’ అని అన్నారు. ఇది గిట్టుబాటు అయ్యేది కాదని అనిపించింది’’ అని చెప్పారు. ఇక లాభం లేదనుకొని పార్టీ నుంచి బయటికి వస్తున్నానని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని తెలిపారు.

‘‘నెల్లూరు జిల్లా పరిణామలు ఏమున్నాయి..? వైసీపీ నుంచి మమ్మల్ని ముగ్గురినీ సస్పెండ్ చేశారు. ముగ్గురం టీడీపీలోకి వచ్చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తా. ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తా. ఉదయగిరి నియోజకవర్గంలో నేను, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి.. లోకేశ్ పాదయాత్రను ఆహ్వానిస్తాం’’ అని పేర్కొన్నారు.
Mekapati Chandrasekhar Reddy
Nellore District
Jagan
Anam Ramanarayana Reddy
Nara Lokesh
TDP

More Telugu News