IAS officer: బైక్ పై గుమ్మం ముందుకే వచ్చి పిండి పట్టి ఇచ్చే మెషిన్
- ఓ తెలివైన వ్యక్తి వ్యాపార మంత్రం
- వీడియోని షేర్ చేసిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్
- ఎంత గొప్ప ఆవిష్కరణ అంటూ ఆశ్చర్యం
డోర్ టూ డోర్ సర్వీసుల గురించి చాలా మందికి తెలుసు. కాకపోతే ఇంటి ముందుకే వచ్చి అందించే సేవలు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. ఇంటి ముందుకు సైకిల్ పై వచ్చి కత్తులు, కత్తెరలు పదును పెట్టిచ్చే వారి గురించి తెలిసే ఉంటుంది. అలాగే, ఇంటి ముందుకే వచ్చి పిండి పట్టించి ఇచ్చి వెళితే ఎంత బాగుంటుంది..? ఈ ఐడియా ఓ వ్యక్తికి వచ్చింది. దీన్నే చక్కని వ్యాపార మంత్రంగా చేసుకున్నాడు. బైక్ కు ఫ్లోర్ మిల్ యంత్రాన్ని బిగించుకుని, డోర్ టూ డోర్ సేవలను ఆరంభించాడు.
అతడు అందించే సేవల వీడియోని ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ‘‘మా అమ్మ ఈ వీడియోని నాకు పంపించారు. ఈ వ్యక్తి ఆటా చక్కి మెషిన్ తో మా ఇంటికి వచ్చాడు. ఎంత గొప్ప ఆవిష్కరణ?’’ అంటూ అవనీష్ శరణ్ తన స్పందన వ్యక్తం చేశారు. నిజానికి అతడి వ్యాపార ఆలోచన గట్టిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మిల్లుకు వెళ్లి పట్టించినా, కల్తీ ఉందేమోనని ఎక్కడో ఏదో సందేహం వేధిస్తుంటుంది. కానీ, ఇంటి ముందుకే వచ్చి మన కళ్ల ముందే ఇలా పిండి పట్టించి ఇస్తే అలాంటి సందేహం ఉండదు. బైక్ ఇంజన్ సాయంతోనే ఈ యంత్రం పనిచేయడం గమనార్హం. అయితే ఈ పోర్టబుల్ ఫ్లోర్ మిల్ ఐడియా కొత్తదేమీ కాదు. మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి.