Kesineni Nani: మహానాడుకు నన్ను పిలవలేదు.. టీడీపీ ఇన్చార్జీలు గొట్టంగాళ్లు: కేశినేని నాని
- సొంత పార్టీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేశినేని నాని
- పార్టీలో తనకు ఎలాంటి పదవి లేదని వ్యాఖ్య
- ఇతర పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయన్న నాని
తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని కొంత కాలంగా వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలను కలుస్తుండటం, వారిని పొగుడుతుండటం వంటి చర్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. కొన్ని రోజులుగా ఆయన పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలే తన బలం అని... ఇంటిపెండెంట్ గా నిలబడినా గెలుస్తానని కేశినేని అన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా తనకు ఆహ్వానాలు వస్తున్నాయని... దీని అర్థం తాను మంచివాడిననే కదా అని అన్నారు. తాను చెడ్డవాడినైతే తనను ఆహ్వానించరు కదా అని చెప్పారు. ప్రజల కోసం అందరితో కలిసి పని చేయాల్సి ఉందని చెప్పారు.
తాను విజయవాడ నియోజకవర్గం ఎంపీని మాత్రమేనని... టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని కేశినేని అన్నారు. తాను పొలిట్ బ్యూరో సభ్యుడిని కాదని, కనీసం అధికార ప్రతినిధిని కూడా కాదని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను గొట్టంగాడని, చెప్పుతో కొడతామని తిట్టిన వాళ్లు కూడా ఉన్నారని... అయితే తాను ఏం మాట్లాడలేదని, ప్రజల కోసం తాను తన పని చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పారు.
ఇటీవల జరిగిన మహానాడుకు తనను పిలవలేదని కేశినేని నాని చెప్పారు. విజయవాడలో ఇటీవల ఒక టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారని, దానికి కూడా తనకు ఆహ్వానం లేదని, ఆ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు వచ్చాడని... ప్రజలకు దీనివల్ల ఎలాంటి మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలను గొట్టంగాళ్లుగా అభివర్ణించారు. మొన్న అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు పీఏ ఫోన్ చేసి పిలిస్తేనే తను వెళ్లానని... లోపల అమిత్ షా, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారో కూడా తనకు తెలియదని అన్నారు.