Uttar Pradesh: తొలిరాత్రే గుండెపోటుతో నవదంపతుల మృతి
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
- మే 30న వివాహం, ఆ రాత్రి దంపతులకు శోభనం
- మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా మారిన నవదంపతులు
- వధూవరులు ఇద్దరూ గుండెపోటుతో మరణించినట్టు పోస్ట్‌మార్టంలో వెల్లడి
- నూతన దంపతుల మరణంతో శోకసంద్రంలో కూరుకుపోయిన కుటుంబసభ్యులు
ఆ నూతన దంపతులకు తొలిరాత్రే చివరి రాత్రి అయ్యింది. పెళ్లయ్యాక శోభనం గదిలోకి వెళ్లిన వారు తెల్లారేసరికి విగత జీవులుగా మారిపోయారు. వధూవరులిరువురూ గుండెపోటుతో ఒకేసారి కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతాప్ యాదవ్‌కు(22) పుష్ఫ(20)తో మే 30న పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వారు శోభనం గదిలోకి వెళ్లారు. కానీ, తెల్లారేసరికల్లా వారు విగతజీవులుగా మారారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, దంపతులకు గుండెపోటు రావడంతో మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ గదిలో వెంటిలేషన్ లేదనీ, కనీసం సీలింగ్ ఫ్యాన్ కూడా లేదని, దీంతో వారికి ఊపిరి ఆడకపోయివుండచ్చని కూడా చెప్పారు. వధూవరులు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో వారి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. దంపతులిద్దరినీ ఒకే చితిపై వుంచి దహన సంస్కారాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉదంతం నెటిజన్లతోనూ కంటతడి పెట్టిస్తోంది.