KCR: అర్చకులకు, బ్రాహ్మణ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్
- అర్చకుల గౌరవ భృతిని రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటన
- అర్హత వయస్సు కూడా 65 ఏళ్లకు తగ్గింపు
- ఐఐటీ, ఐఐఎంలలో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్!
అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవభవృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్‌పల్లిలో తొమ్మిది ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రెండింతలు చేసి ఐదువేల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇక నుండి యాన్యువల్ గ్రాంట్‌గా ఇస్తామన్నారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తోందని, మరో 2,796 దేవాలయాలకు ఈ పథకాన్ని అందిస్తామన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 6,441 దేవాయాలకు ధూపదీప నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందుతుందన్నారు. ధూపదీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేలు ఇస్తున్నామని, దీనిని రూ.10వేలకు పెంచుతున్నట్లు చెప్పారు.