Kodali Nani: జూనియర్ ఎన్టీఆర్ ని నాశనం చేయాలని చూస్తున్నారు: చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
- బీసీల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్న నాని
- వైఎస్సార్, జగన్ పాలనలో బీసీలు ఎక్కువగా లబ్ధి పొందారని వ్యాఖ్య
- అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారని విమర్శ
నిన్న మహానాడులో టీడీపీ ఫేజ్ 1 మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సామాన్యులను ఆకట్టుకునేలా పలు ఆకర్షణీయమైన హామీలు ఇందులో ఉన్నాయి. మరోవైపు టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
బీసీలకు అండగా నిలిచింది స్వర్గీయ ఎన్టీఆర్ అని, బీసీల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని కొడాలి నాని విమర్శించారు. అటువంటి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని అన్నారు. బీసీలు తన వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు... ఈనాడు అధినేత రామోజీరావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడులను ఎందుకు వెనకేసుకున్నారని ప్రశ్నించారు. వీరంతా బీసీలా? అని అడిగారు.
రాజశేఖర్ రెడ్డి, జగన్ పాలనలో బీసీలు ఎక్కువగా లబ్ధి పొందారని కొడాలి నాని అన్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి 79 లక్షల ఇళ్లు కట్టించారని చెప్పారు. ఏపీలోనే 50 లక్షల ఇళ్లు కట్టించారని అన్నారు. బీసీల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.
ఇదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోపై కొడాలి నాని మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక వాగ్దానాలను చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని చంద్రబాబు నెరవేర్చారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్ విసిరారు.