Chandrababu: ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ మృతి బాధాకరం: చంద్రబాబు
- ఆర్-5 జోన్ లో విధుల కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్
- అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా పాము కాటు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పవన్ కుమార్
- విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పవన్ కుమార్ ఇటీవల తుళ్లూరు మండలం అనంతరంలో పాముకాటుకు గురికావడం, చికిత్స పొందుతూ మృతి చెందడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాము కాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసిందని చంద్రబాబు మండిపడ్డారు. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ, వారి క్షేమం గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఇది అని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నానని వెల్లడించారు. కానిస్టేబుల్ పవన్ కుమార్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్-5 జోన్ లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీకి సన్నద్ధమవుతుండగా, ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను ఇక్కడకు రప్పించారు. ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్... రాత్రి వేళ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయం వద్ద ఇతర కానిస్టేబుళ్లతో పాటు విశ్రమించారు.
నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో, ఆయన పామును పట్టుకుని ఇవతలికి లాగారు. దాంతో పాము చేతిపై కూడా కాటు వేసింది. ఆయనను ఇతర కానిస్టేబుళ్లు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందారు.