mystery: శానంబట్ల గ్రామంలో అగ్నిప్రమాదాల మిస్టరీ వీడింది.. ఓ యువతి పనేనని తేల్చిన పోలీసులు

Police revealed sanambatla fire accidents mystery

  • వరుస అగ్నిప్రమాదాలతో హడలిపోయిన గ్రామస్థులు
  • గ్రామంలో క్షుద్రపూజలు జరిగాయని ప్రచారం
  • గ్రామదేవతకు మొక్కులు, పూజలు.. అయినా ఆగని ప్రమాదాలు
  • సీసీ కెమెరాలతో నిఘా పెట్టి అసలు విషయం గుర్తించిన పోలీసులు

ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న అగ్నిప్రమాదాలతో ఆ గ్రామస్థులు హడలిపోయారు. క్షుద్ర పూజలే కారణమని కొందరు, అరిష్టం వాటిల్లిందని మరికొందరు భావించారు. కష్టం తొలగిపోవాలంటూ గ్రామ దేవతకు పూజలు చేశారు. బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అయినా రోజుకో ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోనే తిష్టవేసి, రాత్రి పూట గస్తీ నిర్వహించారు.

అయినా అగ్ని ప్రమాదాలు ఆగలేదు. గడ్డి వాములకు నిప్పంటుకోవడం, ఇళ్లల్లోని బీరువాల్లో మంటలు చెలరేగి బట్టలన్నీ కాలిపోవడం ఏదో ఒక ఇంట్లో జరుగుతూనే ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శానంబట్లలో ఈ మిస్టరీ చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా రోజుకో చోట అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన ఓ యువతే ఈ ప్రమాదాలకు కారణమని తేల్చారు.

సీసీటీవీ కెమెరాలతో నిఘా..
వరుస ప్రమాదాల మిస్టరీని తేల్చేందుకు పోలీసులు గ్రామంలో పలుచోట్ల సీసీటీవీ కెమెరాలను అమర్చారు. బయటి వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో కీర్తి అనే యువతి రాత్రిపూట అనుమానాస్పదంగా తిరగడం పోలీసులు గుర్తించారు. కీర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అగ్ని ప్రమాదాలకు కారణం తానేనని అంగీకరించింది. పాత గొడవల నేపథ్యంలో బంధువుల ఇళ్లకు నిప్పు పెట్టినట్లు ఒప్పుకుంది. తల్లితో కలిసి ఊరు వదిలి వెళ్లేందుకు తమ ఇంటితో పాటు ఊళ్లో మరికొందరి ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలు సృష్టించినట్లు తెలిపింది.

అత్యాశతో మరో ఇద్దరు..
అగ్నిప్రమాదంలో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందడం చూసి ఇద్దరు గ్రామస్థులు అత్యాశకు పోయారు. కావాలనే తమ ఇళ్లకు నిప్పు పెట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది. దీంతో కీర్తితో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

mystery
sanambatla
Fire Accidents
Andhra Pradesh
Tirupati
ap police
  • Loading...

More Telugu News