RRR movie: ఆర్ఆర్ఆర్ నటుడు మృతి.. రాజమౌళి, ఎన్టీఆర్ నివాళులు
- రే స్టీవెన్సన్ మృతితో సినీ ప్రపంచం దిగ్భ్రాంతి
- ఆయనతో కలసి పనిచేయడం మంచి అనుభవమన్న జూనియర్ ఎన్టీఆర్
- సెట్స్ లో ఎంతో ఉత్సాహంగా ఉండేవారన్న రాజమౌళి
- హాలీవుడ్ ప్రముఖుల నివాళి
హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. హాలీవుడ్ నటుడే అయినప్పటికీ భారతీయ సినీ అభిమానులకు స్టీవెన్సస్ బాగా పరిచయస్థుడే. ఎందుకంటే రాజమౌళి తీసిన మెగా చిత్రం ఆర్ఆర్ఆర్ లో బ్రిటిష్ గవర్నర్ గా స్కాట్ స్టీవెన్సన్ నటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే దర్శకుడు రాజమౌళి షాక్ కు గురయ్యారు. స్టీవెన్సన్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో స్టీవెన్సన్ తో కలసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.
‘‘షాకింగ్.. ఈ వార్తను నేను నమ్మలేకున్నాను. షూటింగ్ సెట్స్ లో రే ఎంతో ఎనర్జీని, చైతన్యాన్ని తీసుకొచ్చేవాడు. ఆయనతో కలసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉండేది. ఆయన కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సైతం స్టీవెన్సన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఆయనతో కలసి ఓ సాహస దృశ్యం చిత్రీకరణ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ‘‘ఈ కష్టమైన దృశ్యాన్ని స్టీవెన్సన్ తో చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన వయసు 56 ఏళ్లు. అయినా, దీన్ని చేసేందుకు ఆయన ఏ మాత్రం సంకోచించలేదు. సెట్స్ లో మీరున్నందుకు ఎప్పటికీ సంతోషిస్తాం. చాలా త్వరగా మమ్మల్ని వీడి వెళ్లారు’’ అని ట్వీట్ చేసింది.
ఇక ఆర్ఆర్ఆర్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. ‘‘రే స్టీవెన్సన్ మరణ వార్త షాక్ కు గురిచేస్తోంది. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయనతో కలసి నటించడం గొప్ప అనుభవం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబం కోసం నా ప్రార్థనలు’’ అని జూనియన్ ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. హాలీవుడ్ ప్రముఖులు ఎందరో స్టీవెన్సన్ మరణవార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతి పట్ల నివాళి తెలిపారు.