Shubhman Gill: ఆర్సీబీ ఆశలు చిదిమేసిన గిల్... ముంబయి ఫ్లేఆఫ్ బెర్త్ కన్ఫామ్

Gill century ends RCB hopes

  • తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి
  • 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విక్టరీ
  • సూపర్ సెంచరీ చేసిన శుభ్ మాన్ గిల్
  • సిక్సర్ల మోత మోగించిన యువ ఓపెనర్
  • ఆర్సీబీ ఓటమితో ప్లే ఆఫ్ దశలో ప్రవేశించిన ముంబయి ఇండియన్స్

ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ దశలోకి అడుగుపెట్టాలని ఆశపడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు శుభ్ మాన్ గిల్ అడ్డుతగిలాడు. గిల్ సూపర్ డూపర్ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ ను గెలిపించగా, ఆర్సీబీ ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టింది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 198 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది. 

ఈ ఇన్నింగ్స్ లో సిక్సర్ల మోత మోగించిన గిల్ ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించడం హైలైట్ గా నిలిచింది. అదే సమయంలో సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం విశేషం. ఓపెనర్ గా వచ్చిన గిల్ 52 బంతుల్లోనే 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ యువ బ్యాట్స్ మన్ 5 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేశాడు. గిల్ సెంచరీ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ మరుగునపడిపోయింది. 

చేజింగ్ లో గిల్ కు విజయ్ శంకర్ నుంచి చక్కని సహకారం లభించింది. విజయ్ శంకర్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, విజయ్ కుమార్ వైశాఖ్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ ఓటమితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బెంగళూరు ఓటమి నేపథ్యంలో, 16 పాయింట్లతో ఉన్న ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్ బెర్తు ఖరారైంది. ఇక ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

ప్లే ఆఫ్ షెడ్యూల్...

క్వాలిఫయర్-1
మే 23- గుజరాత్ టైటాన్స్ × చెన్నై సూపర్ కింగ్స్ 

ఎలిమినేటర్
మే 24- లక్నో సూపర్ జెయింట్స్ × ముంబయి ఇండియన్స్

క్వాలిఫయర్-2
మే 26- క్వాలిఫయర్-1లో ఓడిన టీమ్ × ఎలిమినేటర్ లో గెలిచిన టీమ్ 

ఫైనల్
మే 28- క్వాలిఫయర్-1లో గెలిచిన టీమ్ × క్వాలిఫయర్-2లో గెలిచిన టీమ్ 

Shubhman Gill
Gujarat Titans
RCB
Play Off
Mumbai Indians
IPL

More Telugu News