Amazon forests: రెండు వారాల క్రితం అడవుల్లో కూలిన విమానం.. సజీవంగా 11 నెలల చిన్నారి సహా నలుగురు పిల్లలు
- కొలంబియా దేశంలో వెలుగు చూసిన ఘటన
- మే 1న అమెజాన్ అడవుల్లో కూలిపోయిన విమానం
- ప్రయాణికుల్లో 11 నెలల చిన్నారి, 13 ఏళ్ల లోపున్న మరో ముగ్గురు పిల్లలు
- రెండు వారాలుగా ఆర్మీ విస్తృత గాలింపు
- చిన్నారులు బతికే ఉన్నారని చెప్పేందుకు వరుసగా ఆధారాలు లభ్యం
- గాలింపు తీవ్రతరం చేయడంతో బుధవారం చిన్నారుల జాడ గుర్తింపు
రెండు వారాల క్రితం కొలంబియా దేశంలోని అమెజాన్ చిట్టడవుల్లో ఓ విమానం కూలిపోగా అందులోని 11 నెలల చిన్నారి సహా నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో, దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మే 1న విమానం కూలిపోగా బుధవారం చిన్నారులను గుర్తించారు. ఇది యావత్ దేశానికి సంతోషకరమైన సమయమని కొలంబియా దేశాధ్యక్షుడు గుస్తావ్ పెట్రో ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
మే 1న ఆ విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ముగ్గురు పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానంలో 11 నెల వయసున్న చిన్నారితో పాటూ 13, 9, 4 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు.
దీంతో, ప్రభుత్వం గాలింపు చర్యల కోసం మిలిటరీని రంగంలోకి దిపింది. మొత్తం 100 మంది సైనికుల సాయం తీసుకుంది. ఆపరేషన్ హోప్ పేరిట నిర్వహించిన ఈ గాలింపు చర్యల్లో తొలుత చిన్నారులు క్షేమంగా ఉన్నారని చెప్పేందుకు పలు ఆధారాలు బయటపడ్డాయి. కర్రలతో ఏర్పాటు చేసిన చిన్న గుడారం, కత్తెర, జుట్టుకు కట్టుకునే రిబ్బన్, చిన్నారికి పాలు పట్టే సీసా, సగం తిన్న పండు తదితరాలు వారికి చిక్కాయి. దీంతో, చిన్నారులు బతికే ఉన్నారని సిబ్బందికి నమ్మకం కుదిరింది. అయితే, చిన్నారులు ఎటువెళ్లాలో తెలీక అడవంతా సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయగా బుధవారం చిన్నారుల ఆచూకీ లభించింది. వారిని సురక్షితంగా అడవి నుంచి తరలించారు.
దట్టంగా పెరిగిన అమెజాన్ అడవులు సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి. 40 మీటర్ల ఎత్తు వరకూ పెరిగిన చెట్లు, రకరకాల జంతువులతో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే..పిల్లలు ఒకచోట ఉండకుండా అడవంతా సంచరిస్తుండటం కూడా సమస్యను మరింత పెంచింది. ఈ క్రమంలో అధికారులు హెలికాఫ్టర్లకు పెద్ద స్పీకర్లు అమర్చి చిన్నారులకు వారి మాతృభాషలో సందేశం వినిపించారు. ఉన్న చోటనే ఉండిపోవాలంటూ వారికి సూచించారు.
ఆర్మీ అధికారుల ప్రయత్నాలు ఫలించడంతో చిన్నారులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఆ చిన్నారుల తల్లి, పైలట్, మరో ప్రయాణికుడి మృతదేహాలను మంగళవారం నాడు గుర్తించారు. ఇక, విమానం కూలడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు పైలట్.. విమానం ఇంజిన్లలో సమస్య తలెత్తినట్టు గ్రౌండ్ కంట్రోల్‌కు సమాచారం అందించాడు. ఆ తరువాత కొద్దిసేపటికే రాడార్‌పై విమానం జాడ కనిపించకుండా పోయింది.