Assam: ఫిట్ గా మారితే సరే, లేదంటే వీఆర్ఎస్సే.. అసోం పోలీసులకు డీజీపీ హెచ్చరిక
- మూడు నెలల్లో అధిక బరువును తగ్గించుకోవాలని సూచన
- ఆగస్టులో బీఎంఐ లెక్కిస్తామని వెల్లడి
- బీఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్న వారికి మరో 3 నెలలు అవకాశం
- అప్పటికీ తగ్గకుంటే ఇంటికి పంపిస్తామన్న డీజీపీ
అసోం పోలీస్ శాఖలో సిబ్బంది ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలని, స్థూలకాయులు బరువు తగ్గాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. సీఎంవో సూచనలతో రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. వచ్చే మూడు నెలల్లో.. అంటే ఆగస్టు 15 లోగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ను తగ్గించుకోవాలని తన సిబ్బందికి సూచించారు. ఐపీఎస్ క్యాడర్ కూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఆగస్టు 15 తర్వాత 15 రోజుల పాటు సిబ్బంది బీఎంఐ లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
బీఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్నవారికి మరో అవకాశం ఇస్తామని డీజీపీ చెప్పారు. అధిక బరువును వదిలించుకునేందుకు మరో మూడు నెలల సమయం ఇస్తామని వివరించారు. అప్పటికీ బరువు తగ్గలేదంటే వాలంటరీ రిటర్మెంట్ స్కీమ్ కింద ఇంటికి పంపిచేస్తామని స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి పోలీస్ శాఖలో స్థూలకాయులు కనిపించొద్దని ఆదేశించారు. థైరాయిడ్ సమస్యతో పాటు అనారోగ్య కారణాలతో బరువు పెరిగిన వారికి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన వివరించారు.
ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ వివరించారు. కాగా, అసోం పోలీస్ శాఖలో ప్రస్తుతం 70 వేల మంది సిబ్బంది ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. పోలీస్ శాఖలో 680 మంది స్థూలకాయులను ఇప్పటికే గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ తర్వాతే ఈ జాబితాను సిద్ధం చేశామని, అధిక బరువుతో ఉన్న వీరంతా పోలీస్ జాబ్ కు పనికిరారని తేల్చేశారు. అయితే, ఫిట్ గా మారేందుకు వీరికి మరో అవకాశం ఇస్తున్నామని తెలిపారు.