Heat Waves: కోస్తాలో భానుడి విశ్వరూపం.. నేడు, రేపు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు!

AP Govt warns about heat waves

  • ఎండలకు తోడైన వడగాల్పులు
  • కుతకుత ఉడికిన ఉమ్మడి  కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు
  • జంగమహేశ్వరపురంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • వచ్చే రెండుమూడు రోజులు ఇలానే ఉంటుందన్న విపత్తు నిర్వహణ శాఖ

కోస్తాలో భానుడు చెలరేగిపోతున్నాడు. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. మండుతున్న ఎండలకు వడగాలులు తోడవడంతో నిన్న కోస్తాంధ్ర కుతకుత ఉడికిపోయింది. ఎండలకు తట్టుకోలేని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లు బోసిపోయి కనిపించాయి.  ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. బంగాళాఖాతంలో ఉన్న తుపాను దిశగా పడమర వైపు నుంచి వీచిన గాల్లో తేమ లేకపోవడంతో ఎండ మండిపోయింది.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ భానుడు భగభగలాడాడు. పగటి ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 శాతం అధికంగా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40, అంతకుమించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగ్గయ్యపేటలో 44.8, ద్వారకా తిరుమలలో 44.7, కామవరపు కోటలో 44.5, నందిగామలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

నేడు, రేపు కూడా పరిస్థితి ఇలానే ఉంటుందని, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాలలో వచ్చే రెండు మూడు రోజుల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Heat Waves
Krishna District
Guntur District
Summer
  • Loading...

More Telugu News