Uday Kumar Reddy: వివేకా హత్య కేసు: ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు
- వివేకా హత్య కేసులో ఇటీవల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్
- బెయిల్ పిటిషన్ పై నేడు వాదనలు
- ఉత్తర్వులు ఈ నెల 15కి వాయిదా
- ఉదయ్ పై అన్ని ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామన్న సీబీఐ
- అవినాశ్ ప్రమేయం ఉందని సీబీఐ పునరుద్ఘాటన
- వివేకా హత్య కేసు డైరీ కోర్టుకు సమర్పణ
వివేకా హత్య కేసులో ఇటీవల అరెస్టయిన నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. కోర్టు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులు ఈ నెల 15కి వాయిదా వేసింది. నేటి విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు.
వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. బెయిల్ పై బయటికొస్తే ఉదయ్ సాక్షులను ప్రభావితం చేస్తాడని తెలిపారు. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు సేకరించాకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది.
అంతేకాదు, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ పునరుద్ఘాటించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని స్పష్టం చేసింది.