MS Dhoni: ధోనీ మోకాలికి గాయం.. ప్రత్యేక సాధన చేస్తున్నాడు: స్టీఫెన్ ఫ్లెమింగ్
- ధోనీ వికెట్ల మధ్య అంతగా పరుగెత్తలేడన్న ఫ్లెమింగ్
- అందుకే చివరి ఓవర్లపైనే దృష్టి సారిస్తున్నాడని వెల్లడి
- బంతిని బలంగా బాదేందుకు ప్రత్యేక సాధన చేస్తున్నట్టు చెప్పిన చెన్నై కోచ్
చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి సమస్య ఉన్నా, తన ఫ్రాంచైజీ కోసం సాహసం చేసి ఐపీఎల్ 2023 సీజన్ లో ఆడుతున్న విషయం వెలుగు చూసింది. ఐపీఎల్ సీజన్ కు ముందు ప్రాక్టీస్ సమయంలో ధోనీ మోకాలికి నీ క్యాప్ వేసుకోవడం కనిపించింది. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం స్పందించాడు. బుధవారం చెపాక్ స్టేడియంలో ఢిల్లీపై చెన్నై జట్టు గెలుపు తర్వాత మీడియాతో ఫ్లెమింగ్ మాట్లాడాడు.
‘‘ధోనీ అదే మాదిరిగా ఎక్కువ సేపు బ్యాట్ చేయలేడన్నది అతడికి తెలుసు. మోకాలి గాయంతో బాధపడుతున్నందున అతడు చివరి మూడు ఓవర్లపైనే దృష్టి పెడుతున్నాడు. ఓ ప్రత్యేక మార్గంలో శిక్షణ పొందుతున్నాడు. అతడి కంటే బ్యాట్ చేయడానికి ముందు చాలా మంది ఉన్నారు. అందులో చివరి ఓవర్లపైనే దృష్టి సారిస్తున్నాడు. వికెట్ల మధ్య అంతగా పరుగెత్తలేడు. అయినా కానీ ఎంతో కష్టపడుతున్నాడు. అందుకే చాలా బలంగా బంతిని కొట్టే విధంగా సాధన చేస్తున్నాడు. దానికి తగ్గ ఫలితాలను సైతం మీరు చూస్తున్నారు. అయినప్పటికీ, మైదానంలో ఆడేందుకు అతడు సౌకర్యంగానే ఉన్నాడు. అతడు ఎంత మంచి హిట్టరో మాకు తెలుసు’’ అని ఫ్లెమింగ్ ధోనీ సత్తా ఏంటో మరోసారి తన మాటల ద్వారా తెలియజేశాడు.