Imran Khan: ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు.. ఇదిగో వీడియో!

Ex Pakistan PM Imran Khan arrested outside Islamabad High Court

  • బెయిల్ కోసం హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు
  • అవినీతి కేసులో విచారణ జరుగుతుండగానే అదుపులోకి
  • అరెస్టు చేసే సమయంలో కోర్టులో ఘర్షణ.. లాయర్లకు గాయాలు
  • ఇస్లామాబాద్ లో 144 సెక్షన్

పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ను పారామిలిటరీ దళాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో ఆయన్ను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.

తిరుగుబాటు కేసు, హత్యాయత్నం కేసులకు సంబంధించిన విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు ఇమ్రాన్ హాజరయ్యారు. తనపై పలు ఎఫ్ఐఆర్ లు నమోదైన నేపథ్యంలో.. బెయిల్ కోసం వెళ్లారు. ఈ సమయంలో ఇమ్రాన్ ను రేంజర్లు అరెస్టు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. అవినీతి కేసులో విచారణ జరుగుతుండగానే ఆయన్ను ఇలా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

హైకోర్టును రేంజర్లు చుట్టుముట్టారని పీటీఐ వైస్ ప్రెసిడెంట్ ఫవాద్ చౌదరి కూడా ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ను అరెస్టు చేసే సమయంలో కోర్టులో ఘర్షణ జరిగినట్లు సమాచారం. వందలాది మంది పాక్ రేంజర్లు ఇమ్రాన్ ను తీసుకెళ్లిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయా వీడియోలను పీటీఐ పార్టీ ట్వీట్ చేసింది. హైకోర్టులోనికి వెళ్లేందుకు రేంజర్లు ప్రయత్నించడం, అద్దాలను పగులగొట్టడం వీడియోల్లో కనిపించింది.

ఇమ్రాన్ తరఫు లాయర్లకు గాయాలయ్యాయి. తర్వాత ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామాబాద్ లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News