Uttar Pradesh: ఉరివేసుకున్న యజమానిని కిందకు దించేందుకు పెంపుడు కుక్క విశ్వప్రయత్నం

Boy Committed Suicide By Hanging Himself And After A While His Pet Dog Also Died

  • ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలో హృదయవిదారక ఘటన
  • ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
  • మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన పోలీసులను అడ్డుకున్న శునకం
  • శునకానికి మత్తుమందు ఇచ్చి బంధించిన పోలీసులు
  • శునకం కూడా మరణించడంతో పోలీసులపై స్థానికుల ఆగ్రహం

ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమానిని కిందకు దించేందుకు ఏకంగా నాలుగు గంటల పాటు విశ్వప్రయత్నమే చేసిందో పెంపుడు కుక్క. యువకుడి ఆత్మహత్య గురించి తెలిసి ఇంటికొచ్చిన పోలీసులనూ గదిలోకి రానివ్వకుండా అడ్డుకున్న ఆ కుక్కను చివరకు మత్తుమందు ఇచ్చి మరీ బోనులో పెట్టాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఆ తరువాత శునకం కూడా మరణించింది. 

యజమానులపై కుక్కలకు ఉండే విశ్వాసం ఎంతటిదో మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో వెలుగుచూసింది. సంభవ్ అగ్నిహోత్రి అనే యువకుడు పంచవటి కాలనీలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే శాఖ ఉద్యోగి. తల్లి అనారోగ్యంతో మంచాన పడ్డారు. ఆనంద్ అగ్నిహోత్రి తన భార్యను చికిత్స కోసం భోపాల్‌కు తీసుకెళ్లారు.

కాగా, శనివారం ఆనంద్ తన కుమారుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన కరవైంది. దీంతో, ఆయన ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి తన కుమారుడి గురించి ఆరా తీశారు. సంభవ్ ఇంటికి వెళ్లిన వారిపై పెంపుడు కుక్క అలెక్స్ దాడి చేసింది. అయితే, అప్పటికే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో, ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. కానీ, పోలీసులను కూడా కుక్క ఇంట్లోకి రానివ్వకపోవడంతో వారు చివరకు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. ఆ తరువాత అలెక్స్ కూడా కన్నుమూసింది. అయితే, శునకానికి అధిక మోతాదులో మత్తుమందు ఇవ్వడం వల్లే మరణించిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News