TTD: తిరుమల ఆనంద నిలయం వీడియోలు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న టీటీడీ
- ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లవద్దని భక్తులందరికీ తెలుసునని వ్యాఖ్య
- ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్న అధికారి
- ఆ సమయంలో లోనికి వెళ్లిన వ్యక్తి పెన్ కెమెరాతో వీడియో తీసినట్లు అనుమానం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమలలో ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించడమే కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఆలయంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు వెళ్లడం, వీడియోలను చిత్రీకరించడం చట్టపరంగా నేరమని చెప్పారు. ఈ విషయం భక్తులకు తెలుసునని తెలిపారు.
ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురిసిందని, దీంతో రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఈ సమయంలో ఓ భక్తుడు లోనికి వెళ్లి పెన్ కెమెరాతో వీడియోను చిత్రీకరించినట్లుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈవో ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.