SRH: ఆఖరి బంతికి హైడ్రామా... సన్ రైజర్స్ ను గెలిపించిన నోబాల్

SRH thrilling win over Rajasthan Royals in Jaipur
  • 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సన్ రైజర్స్
  • ఆఖరి బంతికి నోబాల్
  • అవుటైనా నోబాల్ కావడంతో బతికిపోయిన సమద్
  • సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన వైనం
అసలు సిసలైన క్రికెట్ మ్యాచ్ అంటే ఇలా ఉంటుంది అనిపించేలా సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఖర్లో హైడ్రామా చోటుచేసుకోగా, చివరి బంతికి సిక్స్ బాదిన అబ్దుల్ సమద్ సన్ రైజర్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. 

హైడ్రామా ఏంటంటే... ఇన్నింగ్స్ చివరి బంతికి సన్ రైజర్స్ గెలవాలంటే 5 పరుగులు చేయాలి. బౌలింగ్ చేస్తున్నది సందీప్ శర్మ... యార్కర్లు వేయడంలో దిట్ట! క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ భారీ షాట్ కొట్టే యత్నంలో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో సన్ రైజర్స్ ఓడిపోయిందనే అందరూ భావించారు. 

కానీ... ఆ బాల్... నోబాల్! అంపైర్ అది నోబాల్ గా డిక్లేర్ చేయగానే... సన్ రైజర్స్ లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక చివరి బంతికి 4 పరుగులు కావాల్సి ఉండగా... సమద్ ఈసారి ఎలాంటి పొరబాటు చేయకుండా బంతిని నేరుగా సిక్స్ కొట్టి రాజస్థాన్ రాయల్స్ కు షాకిచ్చాడు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ 6 వికెట్లకు 217 పరుగులు చేసి నమ్మశక్యం కాని రీతిలో గెలిచింది. 

ఓపెనర్లు అన్ మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) తొలి వికెట్ కు 51 పరుగులు చేసి శుభారంభం అందించగా... వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సులతో 47 పరుగులు చేసి సన్ రైజర్స్ స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్ (12 బంతుల్లో 26) తనవంతు సహకారం అందించాడు. 

క్లాసెన్, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ (7) కొద్ది వ్యవధిలోనే అవుట్ కావడంతో సన్ రైజర్స్ ఓటమి బాటలో పయనిస్తున్నట్టు అనిపించింది. అయితే, ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ కేవలం 7 బంతుల్లో 25 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. 

కానీ ఫిలిప్స్ అవుటవగానే... సన్ రైజర్స్ శిబిరంలో నిరాశ అలముకుంది. సమద్ చివరి ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టి సన్ రైజర్స్ ఆటగాళ్ల ముఖాల్లో వెలుగులు నింపాడు. కాగా, సన్ రైజర్స్ కు ఐపీఎల్ లో ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం విశేషం.
SRH
Rajasthan Royals
Jaipur
IPL

More Telugu News