Same Sex Marriage: ఈ పెళ్లిళ్లను చట్టబద్ధం చేస్తే హోమో సెక్సువాలిటీ పెరుగుతుంది: ఆరెస్సెస్
- డాక్టర్లు, వైద్య నిపుణులతో సంవర్ధిని న్యాస్ సర్వే
- హోమో సెక్సువాలిటీ ఒక మానసిక రుగ్మత అని అభిప్రాయపడ్డ 70 శాతం మంది
- ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించకూడదన్న సర్వే
హోమో సెక్సువాలిటీ అనేది ఒక రుగ్మత అని ఎందరో డాక్టర్లు, వైద్య నిపుణులు భావిస్తున్నట్టు ఆరెస్సెస్ మహిళా విభాగం సంవర్ధిని న్యాస్ నిర్వహించిన సర్వేలో తేలింది. స్వలింగ పెళ్లిళ్లను చట్టబద్ధం చేస్తే హోమో సెక్సువాలిటీ మరింత పెరుగుతుందని సర్వేలో పలువురు అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా 318 మందిని వీరు సర్వే చేశారు. సర్వే చేసిన వారిలో ఆయుర్వేదతో పాటు మరో ఎనిమిది వివిధ వైద్య విభాగాలకు చెందిన వారు ఉన్నారు.
వీరిలో 70 శాతం మంది హోమో సెక్సువాలిటీ ఒక మానసిక రుగ్మత అని అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కం వల్ల లైంగిక వ్యాధులకు గురవుతారని 83 శాతం మంది చెప్పారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తే... సమాజంలో స్వలింగ సంపర్క రుగ్మతను మరింత పెంచినట్టేనని వీరు అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ మానసిక రుగ్మతకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. సేమ్ సెక్స్ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. ఈ క్రమంలోనే సందర్ధిని న్యాస్ ఈ సర్వేను నిర్వహించింది. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఈ తరహా వివాహాలకు చట్టబద్ధత కల్పించకూడదని సర్వే సూచించింది.