Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న సిరిసిల్ల వాసి మృతి

Army chopper crashes in Jammu and Kashmir Telangana Technician Died

  • సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిన హెలికాప్టర్
  • ఆర్మీలో 11 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనిల్
  • ప్రమాదంలో పైలట్, కో పైలట్‌కు గాయాలు
  • విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో తెలంగాణ అధికారి మృతి చెందారు. ఆయన పేరు పబ్బల్ల అనిల్ (29). అతనిది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్. ఆర్మీలో ఆయన సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. భారత సైన్యానికి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కిష్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అనిల్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. 

వరువా నదీ తీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్ శకలాలను గుర్తించిన ఆర్మీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమీప గ్రామాల ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. గాయపడిన పైలట్, కోపైలట్‌ను ఉధంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి మల్కాపూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనిల్ 11 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఆయనకు సౌజన్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అయాన్, అరావ్ ఉన్నారు. నెల క్రితమే స్వగ్రామానికి వచ్చిన అనిల్ పది రోజుల క్రితమే తిరిగి వెళ్లి విధుల్లో చేరారు.

  • Loading...

More Telugu News