Nationalist Congress Party: కౌన్ బనేగా ఎన్సీపీ చీఫ్.. శరద్ పవార్ ఓటు ఆమెకేనా?
- ఎన్సీపీ చీఫ్ రేసులో ఇద్దరి పేర్లు
- తన కూతురు సుప్రియా సూలే వైపే శరద్ పవార్ మొగ్గు.. రేపు ప్రకటించే అవకాశం
- తన వర్గంతోపాటు అజిత్ పవార్ బీజేపీలో చేరుతారంటూ ఇటీవల వార్తలు
- ఆయన తిరుగుబాటుకు చెక్ పెట్టేందుకే శరద్ రాజీనామా!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ నేత శరద్ పవార్ రెండు రోజుల కిందట ప్రకటించారు. సొంత పార్టీలోనే కాదు.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆయన రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన అన్న కొడుకు అజిత్ పవార్ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో ఎన్సీపీకి తర్వాతి చీఫ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ముఖ్యంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు అజిత్ పవార్, ఇంకొరు శరద్ కూతురు సుప్రియా సూలే. తదుపరి అధ్యక్షుని ఎంపిక కోసం శరద్ పవార్ ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
శరద్ పవార్ ను తన నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా పార్టీలోని నేతలు కోరుతున్నారు. ఒకవేళ పవార్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే మాత్రం.. తన కూతురు సుప్రియా సూలేను పార్టీ చీఫ్ గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అజిత్ పవార్ పార్టీని చీల్చి, చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాలని ఎత్తుగడలు వేస్తున్నారని, ఈ తిరుగుబాటు ప్రయత్నాన్ని అధిగమించడానికి పవార్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
ఎన్సీపీ సీనియర్ నేత చగన్ భుజ్ బల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అజిత్ పవార్.. రాష్ట్ర బాధ్యతలు చూసుకోవాలి. సుప్రియా సూలే.. జాతీయ రాజకీయాలను చూసుకుంటారు. శరద్ పవార్ తన నిర్ణయానికే కట్టుబడితే.. సుప్రియ జాతీయ అధ్యక్షురాలు అవుతారు’’ అని చెప్పుకొచ్చారు.