Raghunandan Rao: తన సెక్యూరిటీని రెట్టింపు చేయాలని కోరుతూ డీజీపీకి రఘునందన్ రావు దరఖాస్తు
- భద్రతను పెంచాలని ఏడాది క్రితం కూడా దరఖాస్తు ఇచ్చానన్న ఎమ్మెల్యే
- నాటి దరఖాస్తుపై పోలీసుల నుండి మౌనమే సమాధానంగా ఉందని వ్యాఖ్య
- తన సెక్యూరిటీతో పాటు 2014 నుండి పోలీస్ వాహనాల కొనుగోలు వివరాలు అడిగిన రఘునందన్
తనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం పోలీసులను కోరారు. ఇందుకు సంబంధించి గత ఏడాది భద్రతను పెంచాలని తాను దరఖాస్తు చేశానని, మళ్లీ ఈ రోజు డీజీపీని కలిసి మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు చెప్పారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన దరఖాస్తుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితే, అధికారుల నుండి మౌనమే సమాధానంగా వచ్చిందన్నారు.
తనకు భద్రతను రెట్టింపు చేయాలని గత ఏడాది ఏప్రిల్ నెలలో మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు దరఖాస్తు ఇచ్చానని చెప్పారు. జూబ్లీహిల్స్ రేప్ కేసులో ప్రముఖులకు సంబంధించి ముద్దాయిల కేసు విషయంలో లేదా మంత్రుల మీద ఇస్తున్న సాక్ష్యాలు, ఆధారాలు లేదా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేటుకు సంబంధించి విమర్శల నేపథ్యంలో తనకు సెక్యూరిటీని పెంచమని మరోసారి కోరినట్లు తెలిపారు. తన భద్రతతో పాటు 2014 నుండి పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినట్లు చెప్పారు.