Karnataka Assembly Elections: కర్ణాటక కాంగ్రెస్ సభలో శివరాజ్ కుమార్!

actor shiva rajkumar says have come as fan of rahul gandhi

  • తాను రాహుల్ గాంధీ అభిమానిగా సభకు వచ్చానన్న శివరాజ్ కుమార్
  • భారత్ జోడో యాత్ర త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని వెల్లడి
  • ఇటీవల కాంగ్రెస్ లో చేరిన శివ రాజ్ కుమార్ భార్య గీత

కన్నడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ హీరో శివరాజ్ కుమార్.. కాంగ్రెస్ సభలో దర్శనమిచ్చారు. చిత్ర‌దుర్గ‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో శివ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

తాను రాహుల్ గాంధీ అభిమానిగా ఈరోజు ఇక్క‌డ‌కి వ‌చ్చాన‌ని చెప్పారు. రాహుల్ ఇటీవ‌ల భార‌త్ జోడో యాత్ర‌తో దేశ‌వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్టార‌ని, ఈ యాత్ర త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని అన్నారు. కాంగ్రెస్ సభలో శివరాజ్ కుమార్ కనిపించడానికి ఒక కారణముంది. ఆయన భార్య గీత మూడు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గీతా రాజ్ కుమార్ సోదరుడు మధు బంగారప్ప ప్రస్తుతం సోరబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వీరి సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప బరిలో నిలవడం గమనార్హం. వీరంతా మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప పిల్లలు కావడం విశేషం.

ఇక కర్ణాటక ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం క్లైమాక్స్‌కు చేరింది. ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున అగ్ర‌నేత‌లు, స్టార్ క్యాంపెయిన‌ర్లు సుడిగాలి ప్ర‌చారంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీ తరఫున చాలా రోజులుగా ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రాజ్ కుమార్ రంగంలోకి దిగారు.

More Telugu News