Salman Khan: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది: సల్మాన్ ఖాన్

salman khan responds on dress code controversy

  • సెట్ లో అమ్మాయిల డ్రెస్‌ విషయంలో సల్మాన్‌ స్ట్రిక్ట్‌గా ఉంటారని చెప్పిన నటి పాలక్ తివారి
  • విమర్శలు రావడంపై స్పందించిన సల్మాన్ ఖాన్
  • మహిళలు అవమానాలకు గురికాకూడదని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్య

మహిళల ‘డ్రెస్‌ కోడ్‌’ వివాదంపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందించారు. మహిళల శరీరాలు ఎంతో విలువైనవని.. వాటిని దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించిన పాలక్‌ తివారీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సెట్‌ లో అమ్మాయిల డ్రెస్‌ కోడ్‌ విషయంలో సల్మాన్‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రతి మహిళ తన శరీరం కనిపించకుండా నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. మెడ నుంచి కింది వరకు శరీరం కప్పి ఉన్న దుస్తులను మాత్రమే వేసుకోవాలి’’ అని చెప్పారు. ఈ విషయంలో సల్మాన్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

‘ఆప్‌ కీ అదాలత్’ లో పాల్గొన్న సల్మాన్‌ను వ్యాఖ్యాత ‘నో లో నెక్‌లైన్’ గురించి ప్రశ్నించారు. ‘‘సెట్‌లోని మహిళల దుస్తుల విషయంలో నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ద్వంద్వ ప్రమాణాల కిందికి రాదా?’’ అని ప్రశ్నించారు.

దీనికి సల్మాన్‌ బదులిస్తూ.. ‘‘ఇందులో ద్వంద్వ ప్రమాణాలంటూ ఏమీ లేవు. మహిళల శరీరాలు చాలా విలువైనవని నా అభిప్రాయం. అందుకే వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే చెబుతున్న మాట కాదు. అబ్బాయిల గురించి చెబుతున్నా. మన తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్ల లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్నా. ఇలాంటి దుస్తుల వల్ల మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నా’’ అని వివరించారు.

తనను చంపుతామంటూ వస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. ‘‘అభద్రతతో జీవించే కంటే భద్రత మధ్య ఉండటం మంచిది. బెదిరింపుల కారణంగా నాకు భద్రత పెంచారు. దీనివల్ల నేనిప్పుడు గతంలో మాదిరిగా రోడ్లపై సైకిల్‌ తొక్కడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడం కుదరదు. ట్రాఫిక్‌లోనూ నా చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నా’’ అని తెలిపారు.

More Telugu News