AP High Court: ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం కోటా కింద ఎంతమందికి ప్రవేశం కల్పించారు?: ఏపీ హైకోర్టు
- ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లు
- 2022లో తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు
- తీర్పు సరిగా అమలు కావడంలేదంటూ న్యాయవాది యోగేశ్ పిటిషన్
- అధికారులపై హైకోర్టు ఆగ్రహం
- తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని హెచ్చరిక
ప్రైవేటు విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని గతేడాది ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ న్యాయవాది యోగేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది 90 వేల సీట్లలో 9,064 సీట్లు మాత్రమే పేదలకు కేటాయించారని తన పిటిషన్ లో వివరించారు.
ఈ ధిక్కరణ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను హెచ్చరించింది. 25 శాతం కోటా కింద ప్రైవేటు సంస్థల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించారో చెప్పాలని నిలదీసింది. కేటాయించిన సీట్ల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది.