China: రంజాన్ రోజున వీగర్ ముస్లింలపై చైనా వేధింపులు.. అడుగడుగునా నిఘా
- 60 ఏళ్లు దాటిన వారినే ప్రార్థనలకు అనుమతించిన చైనా
- అక్కడక్కడ ఒక్కో మసీదును మాత్రమే తెరిచిన అధికారులు
- ఇళ్లలో ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారేమోనని నిఘా
వీగర్ ముస్లింలపై చైనా చేస్తున్న దారుణాలకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. రంజాన్ రోజున ప్రార్థనలు చేసుకోకుండా వారిని అడ్డుకుంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ‘రేడియో ఫ్రీ ఏషియా’ పేర్కొంది. షింజియాంగ్ ప్రావిన్స్‌లో చాలా చోట్ల వీగర్ ముస్లింలను చైనా అధికారులు ప్రార్థనలకు అనుమతించలేదని తెలిపింది.
‘రేడియో ఫ్రీ ఏషియా’ కథనం ప్రకారం.. ఏప్రిల్ 20-21న ఈదుల్ ఫితర్ సందర్భంగా అత్యంత భారీ భద్రత మధ్య 60 ఏళ్లు, అంతకంటే పైబడిన వారిని మాత్రమే స్థానిక మసీదుల్లో ప్రార్థనలకు అనుమతించారు. అంతేకాదు, ఇళ్లలో కూడా ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారేమోనని అధికారులు తనిఖీలు చేశారు.
యార్క్‌వ్రుక్ పట్టణంలో ప్రార్థనల కోసం ఒకే ఒక్క మసీదును తెరిచారు. బులుంగ్ పట్టణంలోని బేకౌంటీ ప్రాంతంలో కూడా 60 ఏళ్ల దాటిన వారిని మాత్రమే ప్రార్థనలకు అనుమతినిచ్చారు. 60 ఏళ్లలోపు వారు ప్రార్థనల్లో పాల్గొన రాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, చైనాలో 2017 నుంచి జాతి, మతపరమైన ఆచారాలను పాటించడంపై నిషేధం ఉంది. దీనిని అత్యధికంగా వీగర్ ముస్లింలపైనే అమలు చేస్తుండడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, చైనా మాత్రం దీనిని సమర్థించుకుంటోంది.