Bandi Sanjay: తాజ్ మహల్ మాదిరి సచివాలయానికి మేం వెళ్లం: బండి సంజయ్
- తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్మాణమని వ్యాఖ్య
- పోచమ్మ గుడికి రెండున్నర గుంటలు ఇచ్చారని విమర్శ
- సచివాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌లు పండుగ చేసుకోవచ్చునని ఎద్దేవా
తాజ్ మహల్ మాదిరి నిర్మించిన సచివాలయానికి తాము వెళ్లేది లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం అన్నారు. సచివాలయ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా... అసదుద్దీన్ ఓవైసీ కోసం సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. బండి సంజయ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సచివాలయంలో అనాధిగా ఉన్న పోచమ్మ గుడికి రెండున్నర గుంటలు, మసీదుకు ఐదు గుంటలు ఇవ్వడమేమిటని నిలదీశారు. తాజ్ మహల్ వంటి సచివాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు పండుగ చేసుకోవచ్చునని ఎద్దేవా చేశారు.
దళిత బంధులో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ ఎందుకు నియంత్రించడం లేదని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల నుండి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఆ రికవరీ చేసిన డబ్బును దళితులకు అందించాలన్నారు. కాగా, తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. నూతన సచివాలయంలో పూజలు చేశారు. వాస్తు పూజ చేశారు. ఈ సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టారు. ఆరు ఫైళ్ల పైన సంతకాలు చేసి, ఇక్కడి నుండి నేడు కార్యకలాపాలు ప్రారంభించారు. రూ.1200 కోట్లతో సచివాలయాన్ని నిర్మించారు.